top of page
Search
Writer's pictureG M L NAIDU

సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కానేకాదు

నేడు సామాన్యుల నుండి ప్రముఖులు వరకు ముఖ్యంగా సినీతారలు మరియు గొప్ప వ్యాపారస్తులు లాంటివారు కూడా ఆత్మహత్య చేసుకుని జీవితాల్ని కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో మనకు తెలిసిన కేఫ్ కాఫీడే అధినేత వి.జి.సిద్ధార్థ మరియు ప్రముఖ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లు జీవితంలో ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఒకరు మరియు విషాదానికి గురై మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు, ఇది చాల విచారించదగ్గ విషయం. ఇలానే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏటా చనిపోయిన వారిలో 1.5 శాతం మంది ఆత్మహత్య చేసుకున్నవారే ఉంటున్నారు. సుమారు ఏడాదికి 8 లక్షల మంది ఈ విధంగానే మరణిస్తున్నారంటేనే మనకు అర్ధమవుతుంది, ఆత్మహత్య అనేది ఎంత సాదరనమైపోయిందో. పురుషులు మరియు 40 ఏళ్ల వయస్సు గల వారు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు అని పరిశోధనలు చెపుతున్నాయి. అవును నిజమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రమారమి ప్రతీ ఏటా 500ల మంది అన్నదాతల బలన్మరణాలు చూస్తున్నాం, అంతేకాకుండా అప్పులు, నిస్సహాయత, నిరుద్యోగం, కుటుంభ కలహాలు, అపార్ధాలు, ఆకలి, కష్టనష్టాలు, అర్ధంలేనితనంతో యువత, ఇలా అనేకరకమైన కారణాలతో అన్ని వయసులలోను మనం ఈ ఆత్మహత్యలను చూస్తున్నాం. ప్రతీరోజు దినపత్రిక చూస్తే ముందుగా ఇవే తారసపడుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిన్నపిల్లలలో కూడా మనం ఇటువంటి దురదృష్టకర అగాయిత్యాలు చూస్తున్నాము. వీటికి కారణం ఏమిటి? పరిస్థితులా? సమాజమా?

ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం: సాదారణంగా మనం అందరం ప్రతీరోజు ఎదుర్కొనే లేదా తారసపడే అంశాలే కాని వీటి తీవ్రతనుభట్టి మనపై ప్రభావం చూపిస్తాయి, ఉదాహరణకి ఒక పిల్లవాడికి అడిగిన వస్తువు కొనివ్వలేదని వాడిలో పెరిగే ద్వేషం లేదా ఒక యువకుడు లేదా యువతి కోరుకున్న ప్రేమను అంగీకరించలేదని అలాగే ఒక వ్యాపరస్తుడికి తీవ్రమైన నష్టం లేదా ఒక ప్రముఖ వ్యక్తికి కోరుకున్న/రావలసిన గుర్తింపు రాలేదని ఇలా ఎన్నోకారణాలు, చూద్దాం ఆ కారణాలు ఏమిటో...!

1. విషాదం (డిప్రెషన్) మరియు మానసిక అస్తిరత్వం కలిగి ఉండటం: ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది డిప్రెషన్ కు గురైన వారే. తీరని నష్టం కలిగినప్పుడు తప్పు చేశామని బాధపడడం, ఆందోళనకు గురికావడం, వారిపై వారే నిందలు వేసుకోవడం, వంటి ఆలోచనల వలన వారి మానసిక స్థితిలో మార్పులు కలిగి తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యి ఆత్మహత్యకు పాల్పుడుతున్నారు, అంతేకాక వీరు ఎక్కువగా ఒంటరిగా గడపడం వలన వీరి భావాలను ఇతరులతో పంచుకోలేక వారిలో వారే కుమిలిపోతుంటారు. కొతమంది నిరంతరం వారి ఆలోచనలు వారు మెదులుతూ ఉండటం వలన భ్రమలకు గురి అయి ఆత్మహత్య చేసుకుంటున్నారు దీనిని Bi-polar disorder అని అంటాము తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే.

అలాగే కొంతమంది ఎక్కువగా భవిష్యత్తులో కన్నా గతంలో ఎక్కువగా జీవిస్తుంటారు, ఇటువంటివారు గతంలో జరిగిన భయంకర సంఘటనలు మర్చిపోకపోవడం వలన పదే పదే గుర్తుచేసుకొని లేదా అటువంటి సంఘటనలు ఏవైనా ఎదురవ్వడం వలన వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు దీనినే Post Traumatic Stress Disorder అని అంటాము. ఇలానే అనేకరకములైన మానసిక ఇబ్బందులవలన స్కీజోఫ్రేనియా (Schizophrenia), పర్సనాలిటీ డిజార్డర్ (Personality Disorder), Anxiety Disorder వంటి మానసిక సమస్యలవలన చాలా మంది సరైన అవగాహన లేక వాటిని ఎలా అదుపుచేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మద్యపానం, మాధకద్రవ్యాలు లేదా మరేమైనా ఇతర మత్తు పదార్థాలు తీసుకునే వారిలో కూడా ఆత్మహత్యకు పాల్పడే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.

2. నిరాశ(Hopelessness): చాలా మంది జీవితంలో ఏదో సాధిద్దామని ప్రయత్నించి విఫలమైన వారు, ఆశించిన ఫలితాలు పొందని వారు, తీరని కోర్కెలపై వ్యామోహంతో వాటిని దక్కించుకోలేక, నేను దేనికి పనికిరాను అనే భావన ఉన్నవారు తరచూ వారి జీవితాలలో విఫలాలను ఎదుర్కోవడం వలన జీవితం పై తమ నిరాశను వ్యక్తం చేస్తుంటారు. అలాగే కొంతమంది వృద్దులు ఎదురయ్యే సమస్యలు భరించలేక తమ జీవితం ఇతరులకు భారమని భావించి ఇటువంటి చర్యలకు పూనుకుంటున్నారు.

3. ఒంటరితనం (Loneliness) మరియు సమాజానికి దూరంగా ఉండటం (Isolation): కొంత మంది వ్యక్తులు తమ పరిస్థితుల కారణంగా సమాజానికి దూరంగా ఉండవలసి వస్తుంది లేదా వారి జీవనశైలి వలన కూడా ఒంటరిగా ఉంటుంటారు. అధికంగా మనం చూసేవి మనకు కుటుంభ సభ్యులను, ఆప్తులను దూరంచేసుకున్నప్పుడు అంటే తల్లితండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, లేదా స్నేహితులను కోల్పోవడమో లేదా అనివార్యకారణాలవలన విడిపోవడం, వృద్దులలో పదవీ విరమణ, పిల్లలు ఎక్కడో విదేశాలలో ఉండడం, పిల్లలు ఈమధ్యకాలంలో ఎక్కువగా తల్లితండ్రులుకు దూరంగా హాస్టళ్ళలో ఉండడం మరియు కొంతమందికి సమాజం అంటే భయాందోళన కలిగి ఉండటం వంటి కారణాల వల్ల ఒంటరి జీవితాన్ని సాగిస్తారు. వీరిలో ఆత్మస్థైర్యం తక్కువగా ఉండటం వల్ల సమస్యలు వస్తే ఎదిరించే ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటారు.

4. విలువైన వాటిని కోల్పోవడం (Loss of Valuable Things) : ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని సందర్భాలలో ఇది కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు . దేనినైనా కోల్పోయినప్పుడు లేదా కోల్పోతామనే భయం కలిగినప్పుడు అత్మనున్యతా భావానికి లోనయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఓటమిని అంగీకరించలేకపోవడం కూడా ఒక కారణభూతమవుతుంది, బాగా ప్రియమైన లేదా ఇష్టమైన వ్యక్తులను కోల్పోవడం, కొన్నిసార్లు చిన్న చిన్న వస్తువులు కోల్పోయినప్పుడు కూడా నిరాసచెందుతుంటారు. ఉదాహరణకి ఈ క్రింది కొన్ని విషయాలు చూద్దాం.

  • ఉద్యోగం నుండి తొలగింపబడటం లేదా ఉద్యోగం లేకపోవడం

  • సమాజంలో గౌరవం పోవడం

  • సంబంధాలు తెగిపోవడం

  • జైల్లో బంధించబడటం

  • ఆర్థిక సమస్యలు

  • అపనిందలు భరించలేకపోవడం

ఇంకా ఇలాంటి ఎన్నో కారణాలు ఆత్మహత్యకు మూల కారణాలు అవుతున్నాయి.


5. ఆరోగ్య సమస్యలు ( Health Problems) : ఈ ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఆరోగ్య సమస్యలు ప్రధమైపోయాయి, చాలా రకములైన దీర్ఘకాలిక వ్యాదులను వింటున్నాము చూస్తున్నాము మరియు నయం కాని వ్యాధులు అంటే మందులు లేని వ్యాదులు కూడా ఎక్కువైపోయాయి, ఇటువంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడినప్పుడు వాటి నుండి బయట పడలేక లేదా వాటిని ఎదుర్కొనలేక జీవితంపై విరక్తితో, భాదలను భరించలేక మరియు సమాజంలో వివక్షను ఎదుర్కొనలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. కొందరిలో మానసిక మరియు శారీరక అంగవైకల్యం వలన కూడా సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోలేక ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.


6. మీడియా: మీడియా అనేది వివాదాస్పద అంశం అయినప్పటికీ ఇక్కడ మనం ప్రస్తావించక తప్పదు ఎందుకంటే, మన దైనందిన జీవితంలో బుల్లితెర ప్రముఖపాత్ర పోషిస్తుంది. టెలివిజన్ సీరియల్స్, న్యూస్ ఛానల్స్, సినిమాలు, సోషల్ మీడియా వంటివి మనకు వినోదంతో పాటు విషాదం కూడా పంచుతున్నాయి, ఎలా అని ఆలోచిస్తే ప్రతీ చిన్న విషయాన్నీ పదేపదే చూపించడం, లేనిపోని చెడు ఆలోచనలను అందంగా చిత్రీకరించడం, ఎక్కడో ఎప్పుడో జరిగిన విషయాలను మళ్ళి ఇతరవ్యక్తులతో చిత్రీకరించి ప్రసారం చేయడం ఇలా చెప్పుకుంటూ పొతే చాల విషయాలు సమాజంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు అతిముఖ్యమైన సోషల్ మీడియా వ్యవహారం, మనకు తెలియకుండానే కాదు తెలిసే మన పుర్తివివరాలను మనమే ఈ మీడియాలో పోస్ట్ చేస్తాం, వీటిని ఆదారంగా చేసుకొని చాలామంది సైబర్ నేరగాళ్ళు మనపై విరుచుకుపడుతున్నారు ఇలా వీరి బారినపడిన చాలామంది యువత అనేకరకాల ఇబ్బందులకు గురయ్యి ఆత్మహత్య చేసుకున్నవారిని చూసాం దీనినే సైబర్ బుల్లియింగ్ (cyber bullying) అని అంటారు. ఇలా కొంతమంది మనీ మోసాలు కూడా మనం చూసాం అలాగే కొంతమంది మందిపై లేక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులపై చెడు ప్రచారాలు జరిగినప్పుడు వాటిని తట్టుకోలేక, online sexual harassment మరియు పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీకై బెదిరింపులు కు గురైన వారు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు.

7. విద్యార్థులపై ప్రభావం: తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యం తెలుసుకోకుండా వారిని కష్టతరమైన చదువులు చదివించి వారిపై ఒత్తిడి తీసుకురావడం వల్ల మార్కులు సరిగా రాలేదని భయాందోళనకు గురైన విద్యార్ధులు, తల్లిదండ్రుల విపరీత దొరనికి బలైన పిల్లల్ని చూస్తూనేఉన్నాం. అదేవిధంగా కొన్ని రకాల కార్పొరేట్ పాఠశాలల్లో మార్కుల కోసం ఒత్తిడి తీసుకురావడం వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనకు తెలుసు. విద్యార్ధిని విద్యార్ధుల సామర్ధ్యాలను తెలుసుకోని వ్యవస్థలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. అలాగే నిరుద్యోగం కూడా మనదేశంలో పెద్ద సమస్య ఎందుకంటే ప్రతీ విద్యార్ధి ఒక ఇంజినీరో లేదా డాక్టరో కావలి తప్ప మిగిలిన ఉద్యోగాలను గుర్తించలేకపోవడం.


ఆత్మహత్య నివారణ చర్యలు: నివారణ చర్యలు అనేవి తమకుతాముగా గాని లేదా మనచుట్టూ ఎవరైనా అటువంటి ఆలోచనలతో ఉన్నవారిపై మనం తీసుకోవలసిన జాగ్రత్తలు.

  • ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు గల వ్యక్తి ఒంటరిగా ఉంటే ఆత్మహత్యకు పాల్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం వాళ్లతో సన్నిహితంగా ఉండి వారిలో మనోధైర్యాన్ని నింపి ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తూఉండాలి.

  • మానసిక స్థితి బాగోలేని వారిని సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ వద్దకు వారి తీవ్రతనుబట్టి చూపించాలి.

  • జీవితం యొక్క గొప్పతనం గురించి తెలియజేసి జీవితంపై ఆశ పుట్టించాలి.

  • యువకులపై సామర్ధ్యానికి మించిన బాధ్యతలు ఉంచరాదు.

  • ఆర్థిక సమస్యలు శాశ్వతం కాదు అని తెలుసుకునేలా చేయాలి.

  • అనారోగ్యాలకు మంచి వైద్య సదుపాయం అందించి ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకోవాలి.

  • చిన్న చిన్న అపార్ధాలకు బంధాలను వదులుకోకుండా సమస్యలను పరిష్కరించుకోవాలి.

  • మనం అందుబాటులో లేని సమయంలో హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని వారికి తెలియపరచాలి.

  • విద్యార్థులపై మార్కుల కోసం ఒత్తిడి తీసుకు రాకూడదు.

  • వృద్దులు అంటే మన మార్గదర్సకులు అని తెలుసుకుని వాళ్లని ఆప్యాయంగా చూసుకోవాలి.

  • సున్నితమైన మనసు గల వారి నిందించరాదు. సమాజంతో సన్నిహితంగా ఉండేలా వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచి ఆత్మహత్య లను అరికట్టడం లో భాగస్వామ్యలము కావాలి.

జీవితం చాలా విలువైనిది, దానిని చిన్న చిన్న సమస్యల కారణంగా అంతంచేసుకోకూడదు, ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటూనే ఉంటుంది, రూపాయికి మరోవైపు ఉన్నట్లు....సర్వేజనా సుఖినోభవంతు

రచన: G.L.M నాయుడు

సంపాదకులు: డా. నారాయణ నక్కిన


*Note: All these pictures are taken from Google free sources.

115 views1 comment

1 commentaire


G M L NAIDU
G M L NAIDU
22 juil. 2020

Good one

J'aime
bottom of page